ఈ కూటమి విజయ దుందుభి ఇక్కడితో ఆగదు


తెలంగాణలో ఏర్పడిన ప్రజాకూటమి ఇక్కడికి పరిమితం కాదని, యావత్ భారతదేశ భవిష్యత్తు కోసం ఇది పోరాడుతుందని ఖమ్మం ప్రజాకూటమి సభలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే కూటమి దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే పనిలో ఉంటుందన్నారు. ఇదే సభలో రాహుల్ తో వేదిక పంచుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేసీఆర్‌ తనను ఎందుకు తిడుతు న్నారో అర్థం కావడంలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి తెదేపా సహకరించిందా? లేదా? తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్‌ అనే వ్యక్తి ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల అధినేతలిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇదే కావడంతో జనం ఆసక్తిగా తిలకించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించటమే తమ ఉమ్మడి లక్ష్యమని వారిద్దరూ ప్రకటించారు. ఈ లక్ష్యసాధనలో తెలంగాణలో ప్రజాకూటమి విజయం ఒక ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఎన్డీయే ప్రభుత్వంపై పోరులో తెరాస అధినేత కేసీఆర్‌ ఎటువైపు నిలుస్తారో తేల్చుకోవాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సవాల్ విసిరారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలనూ ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఆర్‌బీఐ, ఈసీఐ ఇందుకు నిదర్శమన్నారు. మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ పేరుతో పాత ప్రాజెక్టులకు రంగులు వేయడానికి నిధులు ఖర్చుపెట్టారు. మిగులు బడ్జెట్‌తో అప్పగించిన రాష్ట్రాన్ని అప్పుల భారంలో ముంచేశారు’’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌, తెదేపా నేతలిద్దరూ ప్రజాకూటమి బుధవారం నిర్వహించిన ఖమ్మం ఎన్నికల సభ, హైదరాబాద్‌ రోడ్‌షోలలో పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు.కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చి, జాతీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తోన్న మోదీని ఓడించేందుకే భాజపాయేతర పక్షాలను ఏకం చేస్తున్నామని తెలిపారు.సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు రమణ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టివిక్రమార్క, ప్రజాకవి గద్దర్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కుంతియా తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు