దొరికిన దొంగ చైనా : ఉరిమిన ట్రంప్


ఉత్తరకొరియా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ చేసిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిన తర్వాత.. దానిని ఉల్లంఘిస్తూ చైనా ఆ దేశానికి చమురు సరఫరా చేస్తోందని వార్తలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. చైనా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఉత్తరకొరియాకు చైనా చమురు నిల్వలను పంపడం విచారకరం. ఇదిలాగే కొనసాగితే.. ఉత్తరకొరియా సమస్యకు సానుకూల పరిష్కారం దొరకదు... అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ, అణ్వాయుధాలు పోగేస్తూ ప్రపంచదేశాలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా ఆగడాలను అడ్డుకునేందుకు అమెరికా గత సెప్టెంబర్‌లో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. సముద్ర మార్గం ద్వారా ఉత్తరకొరియా చమురు దిగుమతులు చేసుకోకుండా ఆంక్షలు విధిస్తూ చేసిన ఈ తీర్మానానికి ఐరాస ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరకొరియా ఇంకో అతి శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీంతో ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు కోరుతూ అమెరికా ఇంకొక తీర్మానం తేగా దానికీ ఐరాస ఆమోదం తెలిపింది. కాగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా ఉత్తరకొరియాకు సాయం చేస్తోందని వార్తలు వచ్చాయి. గత అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకూ ఉత్తరకొరియాకు చైనా 30 సార్లు చమురు సరఫరా చేసిందని దక్షిణకొరియా తెలిపింది. సముద్ర మార్గం లో చైనా ఓడలు ఉత్తరకొరియా ఓడలకు చమురు సరఫరా చేయడాన్నితమ శాటిలైట్లు గుర్తించాయని అమెరికా తెలిపింది. అయితే చైనా మాత్రం ఇంకా బుకాయిస్తోంది. ఉత్తరకొరియాపై వాణిజ్య ఆంక్షలను చైనా కఠినంగా అనుసరిస్తోందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

ముఖ్యాంశాలు