జమిలి ఎన్నికలు దేశానికి మేలు : రాష్ట్రపతి


దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి తొలిసారి ప్రసంగించిన రాష్ట్రపతి ఖజానాపై ఈ చర్య భారాన్నితగ్గించగలదని అన్నారు. అంతే కాక రోజూ ఏదోచోట ఎన్నికలు జరుగుతుండడం వలన దేశాభివృద్ధికి అడ్డంకులు తప్పడంలేదన్నారు. దీనిపై అన్ని పార్టీలూ కలిసి చర్చించాలని ఆయన సోమవారం సూచించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వివిధ పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందన్నారు. అందరికీ ఇళ్లు, నిరంతర విద్యుత్, పేదలకు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ల వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్నదని కోవింద్‌ పేర్కొన్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఎంపీలు పాల్గొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన చర్చ జరగాలని, అన్ని రాజకీయ పక్షాలు దీనిపై ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు. నవభారత నిర్మాణం ఒకపార్టీకో ఒక సంస్థకో సంబంధించిన అంశం కాదని, దీనిపై అన్ని పార్టీలు చిత్తశుద్ధితో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి వెల్లడించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న దుస్సంప్రదాయాన్ని పారద్రోలే గొప్ప అవకాశం ఇవాళ దేశానికి కలిగిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగించాలని అనుకోవటం లేదని వారికి ఆర్థిక, సామాజిక, విద్యా రంగాల్లో సాధికారత కల్పించాలనే పట్టుదలతో ఉందని తెలిపారు. అన్ని వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలు, పేదల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా ముందుకెళ్తోందన్నారు. వ్యవసాయోత్పత్తులకు జరుగుతున్న నష్టాన్ని నివారించటం, సరైన నిల్వ, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, యూరియా ఉత్పాదన పెంచటం వంటి వివిధ ప్రభుత్వ పథకాలనూ రాష్ట్రపతి ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ భారత్‌ మంచి వృద్ధిరేటుతోనే ముందుకెళ్తోందన్నారు. దేశంలో ఆర్థిక సమగ్రతకోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిందన్నారు. రూ. 2లక్షల కోట్లను పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థ పునరుత్తేజం చేసిందన్నారు. అవినీతిపై పోరాటంలో భాగంగా 3.5 లక్షల అనుమానాస్పద కంపెనీలను రద్దు చేశామని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు పునాది వేసే ఉన్నత విద్యావ్యవస్థ, పాఠశాలలను ఆధునికీక రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం పరీక్షలను నిర్వహించేలా ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ పేరుతో ఓ స్వతంత్రవ్యవస్థను ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. మూడున్నరేళ్లలో 93 లక్షల ఇళ్లను కేంద్రం నిర్మించి ఇచ్చిందని ఆయన తెలిపారు. 2022కల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇళ్లుండాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత కొంతకాలంగా అంతర్జాతీయంగా భారత్‌కు గొప్ప గౌరవం దక్కుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.