ఇలాంటి అవినీతి పురుగుల్ని ఏం చేయాలి?


కేవలం రూ.1,300 జీతంపై ఉద్యోగంలో చేరిన ఆ అధికారి ప్రస్తుత జీతం రూ.90వేలు. అప్పటికి ఇంకేమీ ఆస్తులు లేవు. మరి ఇప్పుడో...! ఆయన గడించిన ఆస్తుల పుస్తక విలువ రూ.4కోట్లయితే, మార్కెట్‌ విలువ రూ.40కోట్ల పైమాటే! 15 బ్యాంకు ఖాతాలు, ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఇంట్లోనే మూడు లాకర్లు, బంగారు ఆభరణాలు ఇలా ఆకళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టాడు. చివరికి అవినీతి నిరోధకశాఖకి చిక్కాడు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) అదనపు ముఖ్య నగర ప్రణాళిక అధికారి(అడిషనల్‌ సీయూపీ) పసుపర్తి ప్రదీప్‌కుమార్‌ ఆర్జన చూసి ఎసిబి అధికారులు నివ్వెరపోయారు. గుంటూరులో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో సంయుక్త సంచాలకునిగా పనిచేస్తూ ఈనెల 2న డిప్యుటేషన్‌పై వుడాలో ఇతగాడు విధుల్లో చేరాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఆర్జించాడనే ఆరోపణపై ఇతడిపై ఎసిబి రహస్య విచారణ నిర్వహించింది. డీజీ ఆర్పీ ఠాగూర్‌ ఆదేశాల మేరకు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు జరిపింది. ప్రదీప్‌కుమార్‌ నివాసాలతోపాటు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఐదుచోట్ల సోమవారం ఉదయం ఐదింటి నుంచి తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌, అనంతపురం, ఒంగోలు, విజయవాడ, గుంటూరులలోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు. పెద్దఎత్తున స్థిర, చరాస్తులు గుర్తించారు విశాఖలోని వుడా కార్యాలయంలోని ప్రదీప్‌కుమార్‌ ఛాంబర్‌లోనూ తనిఖీలు సాగాయి. వీటికి కృష్ణా జిల్లా అనిశా డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాద రావు ఆధ్వర్యం వహించారు. ప్రదీప్‌కుమార్‌ను అరెస్ట్‌చేసి విజయవాడ అనిశా కోర్డులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.1984లో ప్రభుత్వ సేవల్లో చేరిన ప్రదీప్‌కుమార్‌ అనంతపురం జిల్లా గుంతకల్‌లో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టరుగా, 1991లో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌గా,1999లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా, 2013లో సిటీ ప్లానర్‌(డిప్యూటీ డైరెక్టర్‌)గా, ఈ ఏడాది టౌన్‌ ప్లానింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ వుడాకు వచ్చాడు. 2015-16లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి సిటీప్లానర్‌గా కూడా పని చేసాడు. ఏ పని చేసినా ఆర్జనే ఇతగాడి ధ్యేయం. ఇతడి పేరిట విశాఖ నగర పరిధి మధురవాడలో 2005లో రూ.2.40లక్షలతో కొన్న 500చ.గ. ఇంటి స్థలం, విశాఖలోని కిర్లంపూడి లేఅవుట్‌లో 2012లో రూ.40లక్షలతో కొన్న ఫ్లాట్‌, అనంతపురం శివాజీనగర్‌లో 2010లో రూ.19లక్షలతో కొన్న ఇల్లు ఉంటే, భార్య లత పేరిట విశాఖ మధురవాడలో 2006లో రూ.3,11,110లతో కొన్న 311చ.గ. స్థలం, అక్కడే 2007లో రూ.7.78లక్షలతో కొన్న మరో ఇంటి స్థలం, విజయవాడ దేవినగర్‌లో ప్రదీప్‌, ట్రెండ్‌సెట్‌ బిల్డర్స్‌ మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం పొందిన రూ.56.74లక్షల విలువైన 166చ.గ. స్థలం ఉన్నాయి. ఇంకా కడప జిల్లా మైదుకూరులో 4.08ఎకరాల సాగుభూమి, అనంతపురం మూర్తినగర్‌లో 4.5ఎకరాల సాగుభూమి, కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరులో 1.07ఎకరాల సాగుభూమి కూడా భార్య పేరుతో ఉన్నాయి. ఇతడి తండ్రి పి.వెంకటరాజు పేరిట రాజమహేంద్రవరం నరసింహరావుపేటలో 253 చ.గ. ఇంటిస్థలం ఉంది. బావమరిది బి.కృష్ణమోహన్‌ పేరిట.. విశాఖ మధురవాడలో రూ.8,98,500తో కొన్న 599 చ.గ. స్థలం ఉంది. చిన్నాన్న నారాయణరాజు పేరిట.. విశాఖ మధురవాడ ప్రాంతంలో 2017లో రూ.60లక్షలు వెచ్చించి కొన్న 200చ.గ. స్థలం ఉంది. ఇతడి భార్య లత ప్రస్తుతం స్నేహితురాళ్లతో సింగపూర్‌ పర్యటనలో ఉంది. ఇంట్లో మూడు లాకర్లను అధికారులు చూసారు. అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయని, లత వచ్చాక వీటిని తెరిపిస్తామని చెప్పారు. ఖరీదైన పట్టుచీరలు ,అలంకరణ సామగ్రి కనుగొన్నారు. ప్రదీప్ పెద్ద కొడుకు హేమంత్‌సాయి స్కాట్లండ్‌లో ఇంజినీరింగ్‌. యూఎస్‌లో ఎంఎస్‌ చదవగా.. ఇందుకు రూ.లక్షలు వెచ్చించినట్టు గుర్తించారు. చదువు పూర్తయ్యాక హెచ్‌ఎస్‌ కనస్ట్రక్షన్స్‌ పేరుతో మధురవాడలో వ్యాపారం ప్రారంభించినట్లు అనిశా గుర్తించింది. కిర్లంపూడి ప్రాంతంలో నిర్మించిన అతిథిగృహం అద్దెకిచ్చేందుకు సిద్ధమయింది. హేమంత్‌సాయి పెళ్లికి కల్యాణమండపం అద్దె, భోజన ఖర్చులకే రూ.30 లక్షలు ఖర్చుచేసినట్లు గుర్తించారు. చిన్న కుమారుడు జయంత్‌సాయి మణిపాల్‌ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ చదువు కోసం రూ.10 లక్షలకుపైనే ఖర్చుచేసినట్లు లెక్క తేల్చారు.

ముఖ్యాంశాలు