2 నుంచి సామవేదం వారి భాగవత నాదం


ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్న అద్భుత సంఘటన ఆంధ్రప్రదేశ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఆవిష్కృతం కాబో తున్నది. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ (హైదరాబాద్), ఋషిపీఠం సత్సంగం (రాజమహేం ద్రవరం) సంయుక్త ఆధ్వర్యంలో ప్రవచన విరించి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే శ్రీమద్భాగవత ప్రవచన మహాయజ్ఞం అద్వితీయంగా జరగనుంది. ఫిబ్రవరి రెండవ తేదీ శుక్రవారం నుంచి మార్చి 15 వ తేదీ వరకూ.. అంటే 42 రోజుల పాటు ఈ ప్రవచన మహా యజ్ఞం జరగనుంది. నగరంలోని శ్రీ విరించి వానప్రస్థాశ్రమ ప్రాంగణం (శ్రీరామ్ నగర్) లో సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకుజరిగే ఈ ప్రవచన మహాయజ్ఞం నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. ఆంధ్ర మహాభారతం పుట్టిన గడ్డ.. గోదావరి సీమ! ఈ సీమపై శ్రీమద్భాగవతాన్ని సర్వ సమగ్రంగా వివరిస్తూ, వ్యాసమహర్షి హృదయాన్నిఆవిష్కరించే మహత్కార్యానికి సద్గురువర్యులు నడుంకట్టడమే ఇందలి అద్భుతం. ఈ ప్రవచనం, శ్రవణం విశ్వశాంతికి, మానవ కల్యాణానికి దోహదం చేస్తాయని నిర్వాహక బృందం డాక్టర్ టివి నారాయణరావు, మారేపల్లి సూర్యనారాయణ, వెంపాటి రవీంద్రనాథ్, దినవహి హనుమంతరావు, కామర్సు వరప్రసాద్, కెవిఎస్ అప్పాజీ తెలిపారు. మోక్షశాస్త్రంగా పేరుగాంచిన భాగవతాన్ని సప్తాహంగా, ఏకాదశాహంగా ఏడు రోజులు, పదకొండు రోజులు వినిపించే ప్రయత్నాలు మాత్రమే ఇంతవరకూ జరిగాయి. దీనివలన వేలాది శ్లోక సముచ్ఛయమైన, అనంత ధర్మనిధి అయినా భాగవతాన్ని పరిచయం చేయడం మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప అందలి విశేషాలను వివరిం చే ఆస్కారం ఉండదు. అయితే ఇప్పుడు 42 రోజులు రోజుకు రెండు గంటల చొప్పున భాగవతామృత ఆస్వాదన కారణంగా భక్తజనులు తరించుటే కాకుండా... లోకమంతా భాగవత స్పృహ ఆవరించి జగత్కల్యాణం జరుగుతుంది. ఏడు రోజుల పాటు రెండు పూటలా భాగవత శ్రవణం చేస్తే రాజస శ్రవణం అని, 21 రోజుల పాటు రెండు పూటలా వింటే సాత్విక శ్రవణం అనీ అంటారని సద్గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. రోజూ రెండు పూటలా సమయం కేటాయించడం అందరికీ సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఈ ప్రవచనాన్ని 42 రోజులపాటు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. పరీక్షిన్మహారాజు ఏడురోజుల పాటు భాగవత శ్రవణం చేయడం వలన సప్తాహం ప్రాచుర్యంలోకి వచ్చిందని.. అయితే నిజానికి ఆ మహారాజు తన ఆయుర్దాయం అంతే ఉన్నందున అన్ని రోజులు మాత్రమే విని తరించాడని షణ్ముఖ శర్మ అన్నారు. ఆజన్మాంతం వినవలసిన మహద్ గ్రంథం భాగవతమని సూత్రీకరించారు. భాగవతం ఈ యుగ గ్రంథం అని ఆయన అన్నారు. ప్రధానంగా వ్యాస భాగవత ప్రమాణంగా ఈ ప్రవచన మహాయజ్ఞం సాగుతుందని.. సందర్భోచితంగా పోతనభాగవత ప్రస్తావన ఉంటుందని తెలిపారు. శ్రీమద్భా గవత శ్రవణం మానవుని ఆలోచనను, జీవన సరళిని సంస్కరిస్తుందని గురుదేవులు తెలిపారు. మానవునిలో త్యాగనిరతిని, ఆధ్యాత్మిక చింతనను, సాత్విక ప్రవృత్తిని, నిస్వార్థ తత్పరతను ప్రేరేపించి అతడి శక్తిని లోకోపయుక్తం గావించే గొప్ప సాధనంగా భాగవతాన్ని సంభావించుకోవాలన్నారు. వ్యాసమహర్షి పురాణేతిహాసాలు, వేదవిభజన తదాదిగా గల అన్నిటినీ రచించిన తర్వాత వాటన్నిటి సారభూతంగా శ్రీమద్భాగవత వాణిని లోకానికి వరంగా అందిం చాడన్నారు. ఈ భాగవతం నెపంగా అనేక సద్విషయాలను, ధార్మిక, ఆధ్యాత్మిక రహస్యాలను ఆర్షబంధువులకు ఈ వేదికనుంచి తెలియజేయడాన్ని అదృష్టంగా.. పరమేష్ఠి కల్పించిన సదవకాశంగా భావిస్తానని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు.

ముఖ్యాంశాలు