హ్యాట్రిక్ ఎమ్మెల్యే .. అయినా సొంతిల్లు లేదు


కుంజా బొజ్జి 1985, 1989, 1994 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వయసు ఇప్పుడు 90 ఏళ్ల పైనే. సీపీఎం కి చెందిన బొజ్జి 1962లో ఆ పార్టీలో సభ్యత్వం పొందారు. వరరామచంద్రాపురం మండలం అడవి వెంకన్నగూడెం (ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం నియోజకవర్గంలో కలిసింది). మారుమూల గిరిజన గ్రామంలో పుట్టిన బొజ్జి కుటుంబానికి వ్యవసాయం, పశువుల పెంపకమే జీవనాధారం. ఐదెకరాల పొలం ఉండేది. స్వగ్రామం పోలవరం ముంపు గ్రామం కావడంతో పరిహారాన్ని కుమారులు తీసుకున్నారు. ఇందులో రూ.లక్ష తీసుకుని బొజ్జి తన అప్పులు తీర్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలమ్మ సొంతూరులో కుమార్తె వద్ద ఉంటున్నారు. బొజ్జి మాత్రం భద్రాచలంలోని రాజుపేటకాలనీలో మరో కుమార్తె మంగమ్మ వద్ద ఉంటున్నారు. రూ.40 వేల పింఛను ఆయనకి ఆధారం. మూడుసార్లు భద్రాచలం శాసనసభ్యునిగా పనిచేసినా ఆయన సొంత ఇంటిని సమకూర్చుకోలేకపోయారు. అవినీతి పొడ లేకుండా మచ్చలేని రాజకీయ నాయకుడిగా మసిలిన ఆయన అత్యంత సాధారణ జీవితం గడిపారు. బొజ్జి చదువుకోలేదు. పశువుల్ని కాస్తూ గిరిజనుల్ని చైతన్యపరిచే పాటలు నేర్చుకు న్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటానికి ఆకర్షితులయ్యారు. తమ ఊరికి వచ్చిన ఆ దళానికి రోజూ భోజనాలు తీసుకెళ్లేవారు. కోయభాషలో పాటలు పాడి ఆదివాసీలను చైతన్యపరిచారు. రైతు కూలీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. పుచ్చలపల్లి సుందరయ్య పంపిన పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని చదివి విషయం పరిజ్ఞానం పెంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సమకాలికుడు సుంకర వెంకటదాసు వద్ద ఐదు రోజులు రాత్రి బడిలో చదివారు. సామెతలు, పిట్టకథలు చెప్పడంలో దిట్ట. 1970లో స్వగ్రామంలో సర్పంచిగా పోటీచేసి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు బొజ్జి. తర్వాత 1981లో వరరామచంద్రాపురం సమితి అధ్యక్ష ఎన్నికల్లోనూ ఓటమే చవిచూశారు. కానీ, నిరాశ పడలేదు. సీపీఎం 1985లో భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జిని నిలబెట్టగా... ఘన విజయం సాధించారు. 1989, 1994లోనూ గెలుపొందారు. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినవారు మరెవరూ లేరు. శాసనసభ్యుడు కాకముందు 1983లో స్వగ్రామంలో ఉండగా మావోయిస్టుల నుంచి బొజ్జికి కబురు వచ్చింది. కలిసి పనిచేసేందుకు రావాలని రెండుసార్లు కొరియర్లను పంపించారు. వాళ్లే జనంలోకి రావాలిగానీ, తాను వెళ్లనని బెదు రూ లేకుండా వారికి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఒకసారి ఆయన మావోయిస్టుల దాడిలో గాయపడ్డారు కూడా.

ముఖ్యాంశాలు