గర్భిణి కోసం గవర్నర్ ఏం చేసారంటే ...


ఓ గర్భిణికి సకాలంలో వైద్య సహాయం అందించడం కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా తన సొంత చాపర్‌లో ఆమెను ఆస్పత్రికి పంపారు. బుధవారం మధ్యాహ్నం అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూతో కలిసి తవాంగ్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో మిశ్రా పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని ఆమెను తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు తరలించడానికి హెలికాఫ్టర్‌ సర్వీస్‌లు కూడా అందుబాటులో లేవని స్థానిక ఎమ్మెల్యే సీఎంతో చెప్పారు. తవాంగ్‌ నుంచి ఇటానగర్‌ మధ్య దూరం 200 కిలోమీటర్లు మాత్రమే. అయితే కొండ ప్రాంతం కావడంతో ప్రయాణ సమయం 15 గంటల పైనే పడుతుంది. ఇది తెలిసిన వెంటనే మిశ్రా ఆ గర్భిణిని, ఆమె భర్తను తన హెలికాఫ్టర్‌లో ఇటానగర్‌కు తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారు. ఆయనతో పాటు ప్రయాణించాల్సిన ఇద్దరు అధికారులను ఆపేసి గర్భిణిని ఆమె భర్తను హెలికాఫ్టర్ ఎక్కించారు. దార్లో హెలికాఫ్టర్‌ లో ఇంధనం నింపడం కోసం అస్సాంలోని తేజ్‌పూర్‌ లో ఆపారు. అక్కడ టేకాఫ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. గర్భిణి పరిస్థితి విషమించే ప్రమాదం ఉండడంతో గవర్నర్‌ అక్కడి ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులతో మాట్లాడి.. ఆమెను ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇటానగర్‌కు తరలించారు. ఆ తర్వాత మరో హెలికాఫ్టర్‌లో గవర్నర్‌ రాజ్‌భవన్‌కు బయలుదేరారు. రాజ్‌భవన్‌ హెలిప్యాడ్‌లో గర్భిణి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ కాగానే.. అంబులెన్స్‌తో పాటు, ఓ మహిళ వైద్యురాలిని అందుబాటులో ఉంచారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా అంబులెన్స్‌లో ఆమెను హిమా ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్ర చికిత్స చేయగా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. గవర్నర్‌ చూపిన చొరవ వల్ల ఆ గర్భిణికి రెండు గంటల్లోనే వైద్యం అందింది.

ముఖ్యాంశాలు