మౌజన్ హత్య... ఆస్తి తగాదాలే కారణం?


మసీదులో నిద్రిస్తున్న మౌజన్‌ మహ్మద్‌ ఫారూఖ్‌ (61) హత్యకు గురవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఫారూఖ్ మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజన్‌ (చిన్నగురువు)గా చేరాడు. అతడు అక్కడే నివసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఇమామ్‌ అబ్దుల్‌ హసీఫ్‌ గేటు తీసి లోపలికి వెళ్లి చూడగా ఫారూఖ్‌ గాయాలతో మృతిచెంది కనిపించాడు. ఖురాన్‌ కాల్చివేసి ఉండటంతో పాటు ప్రార్థనాస్థలంలో కొంత భాగం అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఇమామ్‌ మసీదు కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ మౌజన్ కు తన సొంత రాష్ట్రంలోని కుటుంబ సభ్యులు, బంధువులతో ఆస్తి తగాదాలు ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. బహుశా హత్యకు అవే కారణాలు కావచ్చని భావిస్తున్నారు. దర్యాప్తును, ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం హంతకులు ఖురాన్ ని కాల్చడం, ప్రార్థన స్థలాన్ని దహనం చేయడం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై జిల్లాకు చెందిన ముస్లిం లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై అనేక గంటల పాటు రాస్తా రోకో చేసారు. దీంతో ట్రక్కులు, బస్సులు, కార్లు ఘటాల తరబడి నిలిచిపోయి జనం వర్ణనాతీతంగా దురవస్థలకు లోనయ్యారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం