జిన్నూరు నాన్నగారి శివైక్యం


జిన్నూరు నాన్నగారుగా సుప్రసిద్ధులు, అందరికీ సన్మార్గం ఉపదేశించిన గురువులు, జిన్నూరు గ్రామానికి చెందిన భూపతిరాజు వెంకటలక్ష్మీ నరసింహరాజు(84) శుక్రవారం అంతిమ శ్వాస విడిచారు. ఆయన గత 30 ఏళ్లుగా రమణ మహర్షి బాటలో భక్తి మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు. తన ప్రవచనాలతో భక్తుల్లో ప్రేమ, సేవాభావాన్ని నింపే ప్రయత్నం గావించారు. ఆధ్యాత్మిక చింతన తో మానవత్వం అలవడుతుందని, అదే ఆనందానికి మూలమని ఆయన చెప్పేవారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. 20 ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్పూరులోని తన ఆశ్రమంలో ప్రతీ గురువారం, గురుపౌర్ణమికి ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. ఆంధ్ర, తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాలనుంచి కూడా భక్తులు వచ్చేవారు. కొంతకాలంగా జిన్నూరు నాన్నగారు అస్వస్థతకు లోనయ్యారు. ఆశ్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ శివైక్యం పొందారు. ఆయనకు భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు సూర్యనారాయణరాజు, ఇద్దరు కుమారైలు, ఐదుగురు మనువలు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, భాజపా ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నమట్ల కబర్థీ, జిన్నూరు సర్పంచి దాసరి మిస్సమ్మ రత్నరాజు, ఎంపీటీసీ సభ్యుడు పాలవలస తులసీరావు, తెదేపా గ్రామ అధ్యక్షుడు భూపతిరాజు సత్యనారాయణరాజు తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలాది మంది భక్త సమూహం పాల్గొనగా అంతిమయాత్ర సాగింది. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం