మేమింతే... 2018 లోనూ మారం!


క్షిపణి ప్రయోగాలు, అణు పరీక్షలతో ప్రపంచాన్ని రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా కొత్త సంవత్సరంలోనూ తన తీరు మారదని సగర్వంగా ప్రకటించింది. అమెరికా ఈ దేశాన్ని దారికి తేవాలని చేయని ప్రయత్నం లేదు. ఐక్యరాజ్యసమితి కూడా పలు ఆంక్షలు విధించింది. ఇన్ని జరిగినా తమ తీరు మారదని ఉత్తర కొరియా నాయకత్వం గర్వంగా చెబుతోంది. 2018లోనూ తమ దేశం అణుశక్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఉత్తరకొరియా విధానాల్లో మార్పులను అంచనా వేయకండి. మా స్వాతంత్య్రం ముందు ఏ అధికార బలం పనిచేయదు. ఏ శక్తి మమ్మల్ని బలహీనపరచలేదు. అణు సంపత్తిగా ఎదగాలన్న మా దేశం తన అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. అమెరికా, దాని అనుబంధ దేశాల నుంచి అణు ముప్పు ఉన్నంతకాలం మేం అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉంటాం’ అని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ( ఆ దేశపు అధికారిక మీడియా) ఒక ప్రకటనలో పేర్కొంది. 2017లో ఉత్తరకొరియా పలు క్షిపణి ప్రయోగాలు చేసింది. చివరిగా నవంబర్‌ 29న అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఎన్ని ఆంక్షలు వచ్చినా ఉత్తరకొరియా చలించడంలేదు. తమ ప్రయోగాలు కొనసాగుతాయని చెబుతోంది. దీంతో వచ్చే ఏడాది మరింత ఉద్రిక్తత తప్పేలా లేదు.

ముఖ్యాంశాలు