రాయబారిని వెనక్కి పిలిపించిన పాలస్తీనా


ముంబయి దాడుల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తో పాక్ లో పాలస్తీనా రాయబారి వేదిక పంచుకోవడం పై భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాలస్తీనా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ లోని తన రాయబారిని ఆ దేశం తక్షణం వెనక్కి పిలిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జమత్‌-ఉద్‌-దవా టెర్రరిస్ట్ సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లోని రావల్పిండి ఏరియాలో ఓ ర్యాలీ నిర్వహించగా పాక్ లో పాలస్తీనా రాయబారి వలీద్‌ అబు అలీ కూడా హాజరై సయీద్‌తో కలిసి వేదికపై మాట్లాడాడు. వారి ఫోటోలు కూడా మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించి దీనిపై వివరణ కోసం పాలస్తీనాను డిమాండ్‌ చేసింది. జెరూస‌లెంను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించినప్పటికీ భారత్‌ పాలస్తీనాకే మద్దతిస్తూ ఐరాసలో ఓటు వేసింది. ఈ విషయాన్ని కూడా విస్మరించి, భారత్‌ లో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సయీద్‌తో పాలస్తీనా రాయబారి ర్యాలీలో పాల్గొనడం ఏమిటని భారత్ ప్రశ్నించింది. ఈ ఘటనపై పాలస్తీనా విచారం వ్యక్తం చేసింది. ఇది జరిగి ఉండకూడదని పేర్కొంది. అంతర్జాతీయంగా టెర్రరిజంపై జరుగుతున్న పోరాటంలో పాలస్తీనా కూడా భాగస్వామి అని గుర్తు చేసింది.

ముఖ్యాంశాలు