గుజరాత్ లో రాజకీయ విష ప్రయోగాలు!

గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే కుల వాదాన్ని రెచ్చగొట్టి, మత వాదాన్ని ప్రేరేపించి.. చివరికి జాతీయతను కూడా మరచిపోయి నానా దారుణాలకూ ఒడిగట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటైన బిజెపి ప్రభుత్వం పై అప్పుడే తన మార్కు ప్రయోగాలు మొదలెట్టింది. ఇందుకు గుజరాత్ సీఎం విజయ్ రూపాని చర్యలు ఊతం ఇస్తే కాంగ్రెస్ తెర వెనుక సెగ రాజేస్తోంది. దీనికి పాటీదార్ అనామత్ నాయకుడు హార్దిక్ పటేల్ పెద్దరికం వహిస్తున్నాడు. మూడు రోజుల గడవక ముందే సీఎం విజయ్ రూపానీకి అసమ్మతి సెగ తగిలినట్లు కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తనకు గతంలో కేటాయించిన శాఖల పరిధిని తగ్గించినందుకు అలక బూనినట్లు సమాచారం. గతంలో ఆయన ఆర్థిక, పెట్రోకెమికల్, పట్టణాభివృద్ధితో పాటు పలు కీలక మంత్రిత్వశాఖల బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఈ సారి మాత్రం అందులో నుంచి ఆ మూడు శాఖలను మినహాయించి పటేల్‌కు కేవలం రోడ్లు, భవనాలు, ఆరోగ్యంతో పాటు వేరే శాఖలను కేటాయించారు. అయితే.. మినహాయించిన శాఖలను కూడా మళ్లీ తిరిగి తనకే కేటాయించాలని పటేల్ కోరుతున్నారు. కానీ అందుకు సీఎం రూపానీ సుముఖంగా లేరు. దీంతో సీఎం రూపానీకి నితిన్ పటేల్ మూడు రోజుల గడువు ఇచ్చారని అంటున్నారు. తనకు అప్పగించిన శాఖల బాధ్యతలను స్వీకరించేందుకు ఉపముఖ్యమంత్రి శుక్రవారం కార్యాలయానికి రాకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఈ తతంగంలో తెర వెనుక కాంగ్రెస్ ఉన్నాడనే విషయాన్ని పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ సహా మరో పది మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడేందుకు సిద్ధంగా ఉంటే, వారికి కాంగ్రెస్‌లో మంచి స్థానాలు ఇచ్చేందుకు చర్చలు జరుపుతామని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. భాజపా గౌరవించకపోతే నితిన్ పటేల్ పార్టీ వీడతారని హార్దిక్ పటేల్ అన్నాడు. దీనిని బట్టి గుజరాత్ లో రాజకీయ సంక్షోభ రచనకు హార్దిక్, కాంగ్రెస్ చేతులు కలిపారనేది విషాదం అవుతుంది. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. రెండోసారి సీఎంగా విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ తిరిగి నియమితులయ్యారు.