ఎన్నికల కోడ్ కి మినహాయింపట... !


తుఫాన్లు వస్తే ఒరిస్సా అయినా, ఆంధ్ర అయినా..ఇండియాలో మరే రాష్ట్రం అయినా.. కోడ్ మినహాయింపు ఏమిటి అసలు.. ? ఎన్నికల కోడ్ లో ప్రభుత్వం పని చేయకూడదని ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే పని చేయకూడదు అని ఉండదు. ఒకవేళ ఆలా ఉంటే ముందు ఆ కోడ్ ని మార్చుకోవాలి గానీ.. ఈ మినహాయింపుల ప్రకటనలేమిటి విచిరం కాకపోతే. వరదలు, తుపాన్లలో సహాయ కార్యక్రమాలు చేయొద్దని కోడ్ చెబుతుందా.. లేక కోడ్ ఎగ్గొట్టడం కోసం తుపాన్లని తేగలరా ఎవరైనా? సరే ఇదిలా ఉంటే పాలకుల విజ్ఞప్తుల మేరకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఒరిస్సా రాష్ట్రంలో అలాగే ఏపీలో నాలుగు జిల్లాల్లో కోడ్‌ను సడలించింది. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ మినహాయింపు ఇచ్చింది. ఫొని తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు ముమ్మరంగా సాగించేందుకు వీలుగా కోడ్‌ను సడలించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేసింది. ఫొని తుపాను దృష్ట్యా సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు వీలుగా కోడ్‌ను సడలించాలని ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విన్నవించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం లేఖ పంపారు. దీనిపై ఈసీ నాలుగు జిల్లాలకు మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కోడ్‌ మినహాయింపు ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే వివరాలు ఈసీ పేర్కొనలేదు. ఇప్పటికే ఫొని తుపాను నేపథ్యంలో ఒడిశాలో కోడ్‌ను సడలించిన సంగతి తెలిసిందే.

ముఖ్యాంశాలు