ఓ యావరేజి ప్రయత్నం .. నువ్వు తోపురా

నటీనటులు: సుధాకర్ కోమాకుల, నిరోషా, నిత్యా శెట్టి, జెమిని సురేశ్, ‘జబర్దస్త్’ రాకేశ్ సంగీతం: పల్లికొండ అదృష్ట, దీపక్ సినిమాటోగ్రఫీ: వెంకట్ దిలీప్, ప్రకాశ్ వేళాయుధన్ కూర్పు: ఉద్ధవ్ నిర్మాతలు: సుధాకర్ కోమాకుల, శ్రీకాంత్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అజ్జు మహాకాళి
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల ‘నువ్వు తోపురా’ అంటూ మూడో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సూరి (సుధాకర్ కోమాకుల) సరూర్ నగర్ కుర్రాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి (నిరోషా) అన్నీ తానై పెంచుతుంది. బీటెక్ పూర్తి చేయకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. రమ్య (నిత్య శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. రమ్య పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఓ సాంస్కృతిక కార్యక్రమంలో డప్పు వాయించడం కోసం సూరికి అమెరికా వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది. అక్కడికి వెళ్లాక అతని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? బంధాల విలువ ఎలా తెలుసుకున్నాడు? అక్కడ బతకాల్సి రావడంతో అందుకోసం ఎలాంటి పోరాటం చేశాడు? చివరికి సూరి, రమ్య ఒక్కటయ్యారా?ఇదీ ఈ సినిమా కథాంశం. సరూర్నగర్లో ఉన్నంతసేపు ‘ఈ సూరి ఎవ్వరికీ ఒంగడు’ అంటుంటాడు. అలాంటి కుర్రాడు అమెరికాకి వెళ్లాక అక్కడి పరిస్థితులు చాల నేర్పిస్తాయి. అదే ఈ సినిమా కథ. అమ్మ, స్నేహితులు, మాతృదేశం విలువ అమెరికాకు వెళ్లాక అతడికి తెలుస్తుంది. గల్లీ కుర్రాళ్లతో కలిసి హీరో అల్లరి.. ప్రేయసి వెంట పడుతూ చేసే సందడి, రమ్య తల్లిదండ్రులతో పెళ్లి గురించి మాట్లాడే సన్నివేశాలు ఇవన్నీ నవ్వు పుట్టిస్తాయి. హీరో అమెరికాకు వెళ్లాక కథ మలుపు తీసుకుని ఉద్వేగాల బాట పడుతుంది. చదువుకోని ఒక గల్లీ కుర్రాడు దేశం కాని దేశానికి వెళ్లడం, అక్కడే తలదాచుకోవాల్సి రావడం, అందుకోసం అతను పడే కష్టం, అనూహ్యంగా చోటుచేసుకునే మలుపులు ప్రేక్షకుడిని ఉత్కంఠతో పెడతాయి. వినోదం, సెంటిమెంట్ పండటం సినిమాకు కలిసొచ్చే విషయం. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో పరిచయమైన సుధాకర్ అందులో తరహాలోనే తెలంగాణ యాస మాట్లాడుతూ సందడి చేశాడు. నాయకానాయికలు ప్రేమలో పడే సన్నివేశాల్ని, కథానాయకుడి కష్టాల్ని అతడి కుటుంబ భావోద్వేగాల్ని బలంగా చూపించలేకపోయాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కూడా సాగతీతగా సాగాయి. హీరో వరుణ్ సందేశ్ ఇందులో ఓ కీలక పాత్రలో కథానాయకుడితో కలిసి చేసే సందడి ఆకట్టుకుంటుంది. సూరి పాత్రలో సుధాకర్ కోమాకుల సందడి సినిమాకి ప్రధాన ఆకర్షణ. సంభాషణలు చెప్పిన తీరు, పాత్రలో ఒదిగిపోయిన విధానం ఆకట్టుకుంటుంది. నిత్యా శెట్టి పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. నిరోషా మధ్య తరగతి తల్లి పాత్రలో చక్కగా నటించినా, సరైన సన్నివేశాల రూపకల్పనలో దర్శకుడు విఫలమయ్యాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. అమెరికా అందాల్ని తెరపై బాగా చూపించారు. మొత్తమ్మీద ఒక యావరేజి చిత్రం ఈ తోపు కథ.