ఆ పాఠశాలలో సీట్లు దొరకడమే కష్టం!

నెల్లూరు భక్తవత్సలనగర్‌లోని కేఎన్‌ఆర్‌ పురపాలక పాఠశాల లో పిల్లలను చేర్పించేందుకు జనం క్యూ కడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి దాదాపు 40 రోజులు గడువున్నా పిల్లలకు సీటు కావాలంటూ ఇప్పటి నుంచే అనేకమంది పాఠశాల చుట్టూ తిరుగుతున్నారు. సీట్ల కోసం ఒత్తిడి అపరిమితంగా ఉన్నందున ఈ ఏడాది 7,8,9,10 తరగతుల్లో ప్రవేశాలను నిలిపివేశారు. ఆరో తరగతిలో మాత్రమే కొత్తవారిని చేర్చుకుంటున్నారు. పాఠశాలలో 1200 మందికి మాత్రమే సదుపాయాలున్నా 1400 మంది చదువుతున్నారు. 2010లో సుధీర్‌ అనే విద్యార్థి ఈ బడి నుంచి రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించాడు. అప్పటి నుంచి ఈ పాఠశాల ఏటా జిల్లాలో ప్రథమ స్థానంలోనే నిలుస్తోంది. ఈ బడికి 15 ఏళ్లుగా విజయప్రకాశ్‌రావు ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. ఆయన బదిలీకి విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు ససేమిరా అంటుండడంతో ఆయనని అక్కడే కొనసాగిస్తున్నారు. విజయప్రకాశ్‌రావు ప్రత్యేక కృషితోనే ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలల నుంచి వచ్చి మరీ విద్యార్థులు ఈ పాఠశాలలో చేరుతున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారంటే ఈ పాఠశాల ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. ఆరోతరగతిలో చేరే విద్యార్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే వారికి, పేద విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. సమీపంలో ఉన్న అనేక ప్రైవేటు పాఠశాలలు ఈ బడి పెట్టిన తర్వాత మూతపడ్డాయంటే ఉపాధ్యాయుల కృషి ఎంత గొప్పగా వియజయవంతమైందో అర్థం చేసుకోవచ్చు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ పాఠశాలలో సీటు రావడం కష్టంగా మారిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకుని ఎక్కువ మార్కులు వచ్చేలా కృషి చేస్తున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ పాఠశాలలో సీట్లు కావాలంటూ ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫారుసు లేఖలు వస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ముఖ్యాంశాలు