సర్దార్ సమున్నత విగ్రహావిష్కరణ

సమైక్యతా సారథి, అశేష భారతావనికి ‘సర్దార్’ అయిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ కి ఇవాళ జాతి ఆకాశమంత ఎత్తున ఘన నివాళులర్పించింది. సర్దార్ వల్లబాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా పటేల్ మహా విగ్రహాన్ని ప్రధాని మోదీ గుజరాత్‌లోని కేవడియాలో జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైనదిగా రికార్డు సృష్టించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విగ్రహ విశేషాలు : సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) 182 మీటర్లు (సుమారు 597 అడుగులు) ఎత్తు ఉన్నది. సాధు బెట్ ఐలాండ్. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరంలో వింధ్యాచల్, సాత్పూర పర్వత సానువుల మధ్య దీన్ని నెలకొల్పారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం (విగ్రహం ఒక్కటేకాదు) రూ.2,989 కోట్లు. ఈ ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700 చదరపు మీటర్లు. విగ్రహానికి 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్ మీటర్ల సిమెంటు, 25000 టన్నుల స్టీల్ వాడారు. 5.6 అడుగుల ఎత్తున్న 100 మంది వ్యక్తులను నిలువుగా ఒకరిపై ఒకరిని నిలిపితే ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తున, అలాగే సుమారు 30 అంతస్తుల అపార్టుమెంట్ అంత ఎత్తున ఈ విగ్రహం ఉంటుంది. విగ్రహం ఛాతీ వరకూ రెండు లిఫ్ట్‌ల్లో సందర్శకులను తీసుకువెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. ఒకేసారి 200 మంది ఈ ప్రాంతంలో ఉండొచ్చు. ఈ విగ్రహం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే పెను గాలులను కూడా తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ ఇది భరించగలదు. విగ్రహాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు. మొత్తం 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు. ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 26 మంది వెళ్లవచ్చు. మొత్తం 3వేల ఫొటోలను పరిశీలించి ఈ పటేల్జి విగ్రహానికి రూపునిచ్చారు.