రఫేల్‌ వివరాలు కోర్టుకూ ఇవ్వలేమన్న కేంద్రం

రఫేల్‌ ఒప్పందంపై ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. రఫేల్‌ ఒప్పందానికి అయిన ఖర్చు, యుద్ధ విమానాల ధర వంటి పూర్తి వివరాలను 10  రోజుల్లోగా సీల్డ్ కవర్‌లో సమర్పించాలని న్యాయస్థానం కోరగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ వివరాలను బహిర్గతం చేయలేమని వెల్లడించింది. ‘ఒప్పందం విలువ, యుద్ధ విమానాల ధరకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించాలి. రానున్న 10 రోజుల్లో ఇది జరగాలి’ అని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ధరకు సంబంధించిన వివరాలు మాత్రమే తాము అడుగుతున్నామని, సాంకేతికపరమైన వివరాలు చెప్పాలిసిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ యుద్ధవిమానాల ధర చాలా ప్రత్యేకమైనదని, దీన్ని న్యాయస్థానంతో ఎంతమాత్రం పంచుకోలేమని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ఒప్పందం వివరాలను పంచుకోలేమని చెప్పే అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది. రఫేల్ ఒప్పందంలో భారీ కుంభకోణం అంటూ కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

Facebook