తీరం దాటిన వాయుగుండం


 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం  తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు అతి సమీపంలో మంగళవారం ఉదయం తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 55 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్లు.. గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరానికి ఆనుకుని ఉన్న రెండు పూరిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మత్స్యకారులు నిల్వ చేసిన చేపలు సముద్రంలో కొట్టుకుపోయిన వైనం నెలకొంది. వాయుగుండం తీరాన్ని ధాటిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. 

కాగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో గడిచిన 24 గంటల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలు చూస్తే,.. అత్యధికంగా ఆలమూరు మండలంలో 230.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.  రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో 149 మిల్లీమీటర్ల రాజమహేంద్రవరం అర్బన్‌ మండలంలో 127.2 మిల్లీమీటర్లు,   కడియం మండలంలో 120.2 మిల్లీమీటర్లు,   గోకవరం మండలంలో 83.4 మిల్లీమీటర్లు, కోరుకొండ మండలంలో 86.4 మిల్లీమీటర్లు, రాజానగరం మండలంలో 82.6 మిల్లీమీటర్లు,  సీతానగరం మండలంలో 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం