యుద్ధం వస్తుందా? చైనా మనపై గెలుస్తుందా?


ఇప్పుడు చైనా భారతదేశాన్ని పరీక్షిస్తోంది. నిజానికి ఆ దేశానికి ఇప్పుడు భారత్ తో యుద్ధానికి దిగేటంత శక్తి, స్థోమత, స్థాయి ఇవేవీ లేవు. ఇంకా చెప్పాలంటే కారణం కూడా లేదు. కానీ ఆ దేశం మనల్ని నిత్యం కవ్విస్తోంది. అసలు చైనా తీరే అంత. ఆ దేశం గురించి సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచానికి పుట్టిన క్యాన్సర్ వంటిది అది. చైనాకు 14 దేశాలతో భూ సరిహద్దులు ఉన్నాయి. దాదాపు అన్నిటితోనూ తగవులే. భారత్, భూటాన్ మినహా మిగతా పన్నెండు దేశాలతోనూ అవి ఏదో ఒక స్థాయిలో పరిష్కారం అయ్యాయి. పరిష్కారం అయినా కూడా ఎప్పుడూ చైనా అవన్నీ తనవే అంటూ ఉంటుంది. చైనా ఉక్కు కౌగిలిలో చిక్కుకున్న టిబెట్, తైవాన్, హాంకాంగ్ దేశాల పరిస్థితి చూస్తున్నాం కదా. ఇక సముద్రపు సరిహద్దుల వంతు. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కు తనదేనని వాదిస్తూ అనేక దేశాలతో చైనా ఇప్పుడు తగవులు పెట్టుకుంది. దక్షిణ చైనా సముద్రంలో మరే దేశం వాళ్ళూ చేపలు పట్టుకోకూడదని; పెట్రోలియం నిక్షేపాలకోసం రాకూడదని గట్టి ఆంక్షలు విధించింది.


చైనా ధోరణి వెనుక ఆంతర్యం?

ఒకపక్క కరోనా వ్యాప్తి, విధ్వంసం నేపథ్యంలో ప్రపంచంలో దిగజారిన ప్రతిష్ట, మరోపక్క స్వీయ ఆర్థిక ఇబ్బందులు, ఇంకో పక్క అనేక దేశాలతో వైరం.. ఇవన్నీ చైనాని వేధిస్తున్న సమస్యలు. ఇవన్నీ స్వయంకృతాలే. వీటన్నిటినుంచీ ప్రపంచం దృష్టి మళ్లించడానికి... వీలైతే ప్రపంచాన్ని రెండు కూటములుగా విడదీయడానికి చైనాకి దొరికిన సాకు భారత్ తో ఉన్న సరిహద్దు వివాదం. అందుకే దీన్ని అనవసరంగా ఎగదోస్తోంది. చైనాకి ఉన్న బలం.. ఇలా సమస్యని ఎంతకాలం అయినా సాగదీయగల్గడం. ఉద్రిక్తతల్ని ఇలాగే కొనసాగించగల్గడం. ఆ శక్తి మనకి కాస్త తక్కువ. ఎందుకంటే మనకి ప్రజాసమస్యలు ప్రాధాన్య అంశాలు.. కానీ చైనాకి దురాక్రమణే మొదటి ప్రాధాన్య అంశం. అక్కడ నియంతృత్వం ఉంది కాబట్టి.. అది కమ్యూనిస్టు ఇనుపతెరల వెనుక పాలన కాబట్టి మానవహక్కులు వంటి అంశాలు, అక్కడి పేదల బాధలు ప్రపంచానికి కనిపించవు. ఎవరైనా చెప్పినా ఆ దేశం పట్టించుకోదు. మనకి అలా కాదు. సరిహద్దు ఆవలి విషయాలకు కూడా మానవహక్కులతో ముడిపెట్టి మనల్ని మనమే బదనాం చేసుకునే విపరీతమర్యాదరామన్నలు అపారంగా ఉన్నారు మన దేశంలో. మన బలహీనత, చైనా బలం అదే.


ఇప్పుడు మనమేం చేయాలి?

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భార‍త్ చైనాల శత్రుత్వం, ఈ ఉద్రిక్తత సుదీర్ఘకాలం తప్పదన్న సత్యాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రజలకు కూడా ఇదే అవగాహన రావాలి. టిబెట్ ఆక్రమణను మనమూ నిలదీయాలి. టిబెట్ సార్వభౌమత్వాన్ని ప్రపంచం గుర్తించేలా కృషి చేయాలి. చైనా వ్యతిరేక దేశాలతో జట్టు కట్టాలి. మన సైన్యాన్ని అంటే త్రివిధ దళాలనూ కూడా అన్ని విధాలా బలోపేతం చేసుకోవాలి. ప్రధానముగా టిబెట్ విషయంలో మనం ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరాలి. అంతేకాకుండా పాకిస్థాన్ మినహా శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, నేపాల్, భూటాన్ వంటి అన్ని పొరుగు దేశాలతో సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలి.

భారతదేశం ఎప్పుడూ మొదటి దెబ్బ కొట్టదు. అయితే అవతలివాడు కొడితే చూస్తూ ఊరుకోదు.. తిరిగి కొడితే తట్టుకోలేరు అనే సత్యం గట్టిగా తెలిసేలా చేయాలి. ఎంత పెద్ద యుద్ధానికైనా భారత్ సర్వసన్నద్ధమై ఉందని.. ఈ పోరాటంలో తమ విజయం సులువు కాదని చైనాకి అర్థమైతే చాలు .. వెనుకంజ వేస్తుంది. ఇప్పుడు మన కదనోత్సాహమే మనకి శ్రీరామరక్ష. మన యుద్ధ సన్నాహాలను బట్టి మాత్రమే చైనా వైఖరి ఉంటుంది. గతంలో డోక్లామ్ లో జరిగింది కూడా ఇదే.

ఇక్కడ మనం ఇంకో అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించాలి. చైనా నేరుగా దెబ్బకొట్టే అవకాశాలు తక్కువ. కానీ పాకిస్థాన్ భుజం మీదనుంచి లేదా నేపాల్ భుజం మీదినుంచి తుపాకీ పెట్టి కాల్చే అవకాశాలు చాలా ఎక్కువ. 1963 నుంచి చైనా మనమీదికి పాకిస్థాన్ ను ఎగదోస్తున్నది. తన చేతికి మట్టి అంటకుండా భారత్ ని నిత్యం సమస్యల కొలిమిలో కాల్చాలి అన్నదే చైనా సిద్ధాంతం. లద్దాఖ్‌ సరిహద్దుల్లో నిజానికి ఈపాటికే యుద్ధం మొదలైపోవాలి. అలా జరగలేదంటే యుద్ధం కంటే ప్రమాదకరమైన ఏదో వ్యూహం చైనా దగ్గర ఉంది అని మనం అనుమానించాలి. అంతర్జాతీయంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇలా ఇంకొన్ని దేశాలు ఏకపక్షంగా మనదేశానికి మద్దతు తెల్పడం, అమెరికా ఎన్నికల నేపథ్యంలో అక్కడి నాయకులకి భారత్ తో ఉన్న రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చైనా ఈ సమస్యని ఇప్పటికి ఇలా సాగదీస్తున్నదా? అని కూడా అనుమానం తలెత్తుతుంది.

వివాదం కొనసాగింపే చైనా వ్యూహం

కొందరికి లిటిగేషనే ముఖ్యం. అదే చైనా విధానం. చైనా- భారత్ సరిహద్దు వివాదం 1959లో మొదలై ఆరు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఇండియా మ్యాపు, చైనా మ్యాపులు రెండూ ఇక్కడ ఒకలా, చైనాలో ఇంకోలా ఉంటున్నాయి. దీర్ఘకాలం ఒకే అసంబద్ధ అంశానికి సంబంధించి వివాదాన్ని కొనసాగిస్తూ పోతే... కొంతకాలానికి అదే హక్కుగా మారుతుంది.. ఆపైన బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవచ్చు. ఇదీ చైనా దుర్బుద్ధి. సరిహద్దు వివాదం రావాలంటే అసలు చైనా మనకి పొరుగు దేశం అయి ఉండాలి.. ఆ దేశంతో మనకి భూ సరిహద్దు ఉండాలి. కానీ నిజానికి చైనా అసలు మనకి పొరుగుదేశమే కాదు. 1951 దాకా చైనా మన దగ్గరలోనే లేదు. మధ్యలో ఉన్న టిబెట్ భూభాగాన్ని అది చైనా ఆక్రమించింది. ఆవిధంగా చైనా మనకి పక్కలో బల్లెంలా మారింది. ఇప్పుడు చైనాతో మనకి దాదాపు 3500 కిలోమీటర్ల నిడివిగల సరిహద్దు ఉంది. భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చైనాతో సత్సంబంధాలను కోరుకున్నారు. పొరుగున ఉన్న పెద్ద దేశం కాబట్టి అది స్వాభావికమే. టిబెట్ ఆక్రమణను భారతదేశం వ్యతిరేకించకపోవడానికి మన సుహృద్భావమే కారణం. ఆ క్రమంలో టిబెట్ తో మనకి గల సాంస్కృతిక సంబంధాలను విస్మరించారు. ఆ తర్వాత 1956 నుంచి చైనా మరింత పేట్రేగింది.అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ వంటి భారతీయ భూభాగాల్ని తనవిగా చెప్పుకుంటూ లిటిగేషన్ మొదలుపెట్టింది.

చైనా మన దేశంతో సరిహద్దు వివాదాల్లో ప్రతిష్టంభన, ఉద్రిక్తత లను పదేపదే సృష్టిస్తుంది.. వాటిని కొంతకాలం పాటు కొనసాగిస్తుంది. ఆ తర్వాత చర్చల్లో వివాదానికి మూత వేస్తుంది.మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఇదే కథ మొదలు పెడుతుంది. ఇది యాభై సంవత్సరాలుగా చూస్తున్నదే. దీనివెనుక ఉన్నది క్యాబేజి వ్యూహం అని సైనిక పరిభాషలో చెబుతారు. అర్థం ఏమిటంటే.. ప్రతి వివాదంలోనూ ఎంతో కొంత భూభాగాన్ని.. అది అడుగులు, గజాలు, మీటర్లు, కిలోమీటర్లు.. ఇలా ఎంతైనా కావచ్చు. కానీ ఎంతో కొంత భూమిని అది కబ్జా చేస్తూ ఉంటుంది.

ప్రత్యక్ష యుద్ధమే వస్తే...

1962 అక్టోబర్ లో మనకీ చైనాకి మధ్య యుద్ధంలో ఏమి జరిగిందో మనకి తెలియదు.. కానీ మన దేశం ఓటమి పాలైంది. అనేక వేల కిలోమీటర్ల భూభాగం మనం కోల్పోయాం.. అయితే అప్పటి భారతం వేరు..ఇప్పటి భారతం వేరు. అలాగని అప్పుడు రాజకీయ నాయకత్వం విఫల నాయకత్వమని.. ఇప్పుడు ఉన్నది మహాబలులు అని చెప్పడం ఉద్దేశం కాదు. అప్పటికి దేశానికీ స్వతంత్రం వచ్చి ఇరవై ఏళ్ళు కూడా కాలేదు. దేశానికీ ప్రాథమికంగా కావలసిన జలవనరులు, విద్యావనరులపైనా.. ఇతర కీలక అంశాలపైనా అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టింది. చైనాని నమ్మింది.. అంచేత ముప్పుని ఊహించలేదు. ఫలితంగా రక్షణ పరంగా దేశాన్ని నిర్లక్ష్యం చేసారు. అందుకు దేశం మూల్యం చెల్లించింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మన సార్వభౌమత్వానికి చైనా నుంచి ఏ స్థాయిలో సవాలు పొంచి ఉన్నదో అందరికీ తెలిసింది. ఆ ఎరుకే మనకి శ్రీరామరక్ష. పైగా అనేక దేశాలతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న రాజకీయ నాయకత్వం, దేశ భద్రతా, సైనిక సామర్థ్యం పెంపుపై నిబద్ధత కలిగిన ప్రభుత్వం మనకి ఉన్నాయి ఇప్పుడు. అంచేత చైనా ఏ ఆట ఆడినా ఏకపక్షంగా గెలవలేదు. యుద్ధం ఇప్పుడు ఏమాత్రం అభిలషణీయం కాదు. ఎందుకంటే అపార ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని భరించే స్థాయిలో ఇప్పుడు ఏ దేశమూ లేదు. అభివృద్ధిలో, సైనికశక్తిలో చైనా మనకంటే కనీసం పదేళ్లు ముందున్నా కూడా యుద్ధం జరిగితే సులువుగా గెలిచే చాన్సు అయితే లేదు, భారత్ ఈసారి దీర్ఘకాలం పోరాటానికి సిద్ధం అయిపోయి ఉంది. అందుచేత చైనాకి కూడా భంగపాటు తప్పదు. పైగా రెండు దేశాలూ అణ్వస్త్రాలను సమకూర్చుకొని ఉన్నాయి. ఎవరి దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయనేది అప్రస్తుతం .. ఇవాళ్టి ప్రపంచంలో ఏ రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగినా ఎవరికీ గెలుపు ఓటమి ఉండవు. అపార ఆస్తి నష్టం, ప్రాణనష్టం మాత్రమే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన మరో ప్రమాదకర అంశం ఇక్కడ మనం గమనించాలి. చైనా, భారత్ ప్రత్యక్ష యుద్ధానికి దిగితే... ఆ యుద్ధం ఇక్కడితో ఆగదు. రెండు వైపులా కూటములు గనుక రంగప్రవేశం చేస్తే భీకర యుద్ధంగా మారడమే కాకుండా మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా తెర లేచే విపత్తు పొంచి ఉంది. భద్రత విషయాల్లో మనం అనేక దేశాలతో చేసుకున్న ముఖ్యమైన ఒప్పందాలు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా అవి రంగంలోకి దిగే పరిస్థితిని కల్పిస్తాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం