ఖాతాదారులకు ఎస్ బి ఐ ఆఫర్లు


దేశంలోని అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది. యోనో యాప్‌ ద్వారా కార్ల కొనుగోలుకు, బంగారం, వ్యక్తిగత రుణాలు తీసుకు నేందుకు ముందుకు వచ్చే కస్టమర్లకు నూరు శాతం ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు చేయడం ఇందులో ప్రధానమైనది. అలాగే బ్యాంకు అనుమతించిన వెంచర్లలో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఇంటి రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు పూర్తిగా రద్దు చేశారు. మంచి క్రెడిట్‌ స్కోరున్న కస్టమర్లకు ఇంటి రుణాలపై 0.10 శాతం వరకు వడ్డీ రాయితీ ఇస్తారు. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసిన వారికి మరో 0.5 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. ఎస్‌బీఐ అతి తక్కువ వడ్డీ రేటు 7.5 శాతానికే కారు రుణాలందిస్తోంది. కొన్ని ఎంపిక చేసిన మోడల్‌ కార్లపై నూరు శాతం ఆన్‌ రోడ్‌ ధరకు రుణాలందిస్తారు. బంగారం రుణాలపై 7.5 శాతం వడ్డీ రేటుకే బ్యాంకు రుణాలందిస్తోంది. 36 నెలల రుణ చెల్లింపు వ్యవధి కూడా ఇస్తోంది. కారు, బంగారం రుణాలకు యోనో సూత్రప్రాయమైన అంగీకారం అందిస్తోంది. ఈ పండుగ సీజన్‌ సందర్భంగా కస్టమర్లు 9.6 శాతం కనిష్ఠ రేటుకే వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండానే ఎలాంటి పత్రాల అవసరం లేకుండా ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ రుణాలు పొందవచ్చు. ఆటోమొబైల్‌ రుణాల విభాగంలో ఎస్‌బీఐ కి 33 శాతం వాటా ఉంది. ఎస్‌బీఐలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉపయోగించుకుంటున్న కస్టమర్లు 76 శాతం ఉన్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ సర్వీసు ఉపయోగించుకుం టున్న వారు 1.7 కోట్లకు పైబడే ఉన్నారు. యోనో యాప్‌కు 2.6 కోట్ల మందికి పైగా రిజిస్టర్డ్‌ కస్టమర్లున్నారు. ప్రతీ రోజూ 55 లక్షల మంది లాగిన్‌ అవుతూ ఉంటారు. ఈ యాప్‌ ద్వారా రోజుకి నాలుగు వేల వ్యక్తిగత రుణాలు బట్వాడా అవుతున్నాయి.‘‘ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యం లో వినియోగ వ్యయాలు పెరుగుతాయని, అలాగే పండుగల సీజన్‌లో అధిక వ్యయం ఉంటుందని భావిస్తూ ఆమేరకు కస్టమర్లకు ఎస్‌బీఐ చేయూత ఇస్తోందని ఎండీ (రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) సీఎస్‌ శెట్టి తెలిపారు.

ముఖ్యాంశాలు