శ్రీకృష్ణ వేదం -01

శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం 

భగవద్వియోగాన్ని దూరం చేసే ఉద్విగ్న క్షణాలను ఆస్వాదించేందుకు దేవజనులందరూ ఆకాశాన్ని ఆవరించారు. దివ్య విమానాలతో విశ్వం అంతా నిండిపోయింది... ముక్కోటి దేవతలూ అక్కడే ఉన్నారు. ఉత్కంఠగా, ఆసక్తిగా భూమి వైపే చూస్తున్నారు వారంతా...! మానవనేత్రాలకు అగోచరమైనప్పటికీ ఆ తరుణం ఆ ఆకాశం అంతా నానా వర్ణాలతో ప్రకాశిస్తున్నది. 

సర్వలోకైక నాథుడు తన నిజస్థానాన్నివదలి... భూమికి వచ్చి ఎంత కాలమైందో... ప్రతి క్షణం ఆ స్వామి తన స్వస్థానానికి వచ్చే తరుణం కోసం తామంతా ఎంతెంతగా వేచి చూస్తున్నామో....ఆహా ఇప్పటికి కదా ఆ అద్వితీయ క్షణాలు ఆగమించాయి. ఇలా దేవతాజనుల హృదయాలు పరిపరి యోచనలతో సతమతం అవుతున్నాయి. 

అప్పుడే ఆవిష్కృతం అయింది ఒక మహోద్విగ్న ఘట్టం... 

కీకారణ్యం మధ్యలో ఒక అగోచర ప్రదేశంలో శ్రీకృష్ణమూర్తి బలదేవుడు అభిముఖులై కూర్చుని ఉన్నారు. కృష్ణుడు ఏదో చెబుతూనే ఉన్నాడు అన్నగారితో... అంతలోనే బలరామునిలో ఏదో తత్తరపాటు... అలా తమ్ముడు చెబుతున్నవి వింటూనే.. అలా తమ్ముడి వంక చూస్తూనే దేహం విడిచి పెట్టేశాడు.

అన్న నేత్రాలనుంచి అరుణ వర్ణంతో వెలికి వచ్చిన మహా సర్పాకృతి అద్వితీయ కాంతితో ఊర్ధ్వముఖంగా ఎగసి అంతలోనే అధోముఖమై సాగరంలోనికి నిష్క్రమించి అంతర్థానం కావడం శ్రీకృష్ణునికి స్పష్టంగా కనిపించింది. అప్రతిభుడయ్యాడు కృష్ణస్వామి... 

నూటపాతిక సంవత్సరాల జీవితచక్రం ఒక్కసారిగా ఆ మహనీయుని కళ్ళముందు గిర్రున తిరిగింది. దుర్వాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, నారదుడు, కణ్వ మహర్షి, గర్గుడు, గాంధారి. జరాసంధుడు... ఇలా ఎవరెవరో గుర్తొచ్చారు. 

కర్మఫలాలు, శాప ఫలితాలు అనుభవింపక తప్పనివనే విషయం తెలియనివాడు కాదు ఆ మహనీయుడు. ఆ నీలమేఘశ్యాముని మోమున మందహాసం మెరిసింది. జరగబోయేది యథావిధిగా తోచింది.. ఏమి చేయాలో నిర్ణయించుకున్న ఆ స్వామి కొంత దూరం ముందుకు నడిచాడు.... 

అక్కడొక రావిచెట్టు రా రమ్మని ఆత్మీయంగా ఆ దేవాదిదేవుని ఆహ్వానిస్తూ కనిపించింది... 

చెరగని మందహాసంతో పరమాత్ముడు ఆ చెట్టు క్రిందికే నడిచాడు... అక్కడొక తిన్నె వంటి ప్రదేశం కనిపిస్తే అక్కడ విశ్రాంతిగా ఆసీనుడయ్యాడు.

ఆ సమయంలో శ్రీ కృష్ణుడు చతుర్బాహువులతో, దివ్య కాంతులతో ప్రజ్వలిస్తున్నాడు. ఆ వెలుగులు అంధకారాన్ని పారద్రోలుతుండగా... ఠీవిగా ఆసీనుడైన స్వామి ఎడమ పాదాన్ని కుడి తొడపై పెట్టుకొని చిద్విలాసుడై ఎదురు చూస్తున్నాడు జరగబోయే దారుణం కోసం.... 

పీతాంబర ధారి, మకర కుండలాలంకృతుడు, సుమనోహర నేత్రుడు, కిరీట కౌస్తుభ ప్రకాశితుడు అయిన కృష్ణ పరమాత్మ ఎడమ కాలి బొటనవ్రేలిని ఊపుతూ నిర్నిమేషుడై ఉండగా... 

అప్పుడే ఆ అరణ్యంలోకి ప్రవేశించాడు జర అనే బోయవాడు. 

అల్లంత దూరాన గుబురు పొదల మధ్యలో పరమాత్మ పాదపద్మం సున్నితంగా కదులుతూ ఉండగా చూశాడు ఆ బోయడు. అదేదో జింక కావచ్చని తలచాడు... 

తలచినదే తడవుగా వింటిని ఎక్కుపెట్టి ఆకర్ణాంతం లాగి విడిచాడు శరాన్ని. 

మహావేగంతో దూసుకుపోయిన ఆ బాణం పొదలను చీల్చుకుంటూ వెళ్లి ఆ పాదపద్మాన్ని ఛేదించింది. 

మహా విలాసంగా .. నిర్నిమేషంగా... నిమిత్తమాత్రుడై అక్కడ ఆసీనుడై ఉన్న కృష్ణ పరమాత్మ ఒక్క క్షణం విచలితుడయ్యాడు. కాలినుంచి రక్తధార జాలువారుతుండగా.. బాధగా ఒక నిట్టూర్పు విడిచాడు.

తన బాణం లక్ష్యాన్ని ఛేదించినదని గుర్తించి ఆ వ్యాధుడు పరుగున అక్కడికి చేరుకున్నాడు..

చతుర్భుజాలతో, ఆయుధాలతో కూడినవాడై, సర్వాలంకారములతో శోభిస్తున్న జగన్మోహనాకారుని మృత్యుముఖాన గాంచిన ఆ బోయవాడు బెదిరిపోయాడు. పరమాత్మను గుర్తించి అంతులేని విషాదానికి లోనయ్యాడు. 

"అయ్యయ్యయ్యో...పరమాత్మా.. మాధవా... కృష్ణా.. గోవిందా... నావల్ల ఎంత దారుణం జరిగిపోయింది. అజ్ఞానిని, దుష్టుడిని , దుర్మార్గుడిని అయిన నేను మహా పాపానికి ఒడిగట్టాను. ఏ దివ్య నామాన్ని స్మరిస్తే సకల పాపాలు తొలగిపోతాయో.. అట్టి నామధారిని గాయపర్చిన మహాపాపినయ్యాను. నా ఘోర పాతకానికి నిష్కృతి లేనే లేదు." ఇలా అంటూ అంతులేని దుఃఖంతో విలపించాడు ఆ వ్యాధుడు. 

స్వామీ! నన్ను నీ ఆగ్రహాగ్నితో దహించు... మహాసాధువైన నీ పట్ల నేను పాల్పడిన ఘోర అపచారానికి నన్నీ క్షణమే వధించు... అంటూ స్వామి పాదాలపై పడ్డాడు. 

"జరా! ఆందోళన చెందకు. ఇందు నీ తప్పిదమేమీ లేదు. ఏది జరగవలసి ఉన్నదో అదే జరిగింది. నీవిందు నిమిత్తమాత్రుడవు మాత్రమే." అమృత వచనాలతో ఆ వ్యాధునికి సాంత్వన కూర్చాడు శ్రీకృష్ణుడు. 

 (సశేషం)


ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం