శ్రీకృష్ణ వేదం -02


శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

"జరా! ఆందోళన చెందకు. ఇందు నీ తప్పిదమేమీ లేదు. ఏది జరగవలసి ఉన్నదో అదే జరిగింది. నీవిందు నిమిత్తమాత్రుడవు మాత్రమే." అమృత వచనాలతో ఆ వ్యాధునికి సాంత్వన కూర్చాడు శ్రీకృష్ణుడు.  నాయనా.. నా ఈప్సితము నెరవేర్చిన నీకు ఈ క్షణమే పుణ్యపద ప్రాప్తి ని అనుగ్రహిస్తున్నాను.  కృష్ణస్వామి మాటలు పూర్తయిన మరు క్షణంలోనే ఒక దివ్యవిమానం అక్కడ ప్రత్యక్షమైంది. ఆశ్చర్యానందాలతో చూస్తూనే ఆ బోయవాడు దివ్యశరీరం దాల్చి ఆ విమానాన్ని అధిరోహించాడు.  తనకు తానై కల్పించుకున్న దివ్య ప్రణాళికలో... అనితరమైన విషాద లీలలో పరమాత్మఆ విధంగా మమేకమయ్యాడు... తానే సంకల్పించి, సృష్టించుకున్న మరణ యాతనను మరో క్షణం అనుభవించిన ఆ జగన్నాటక సూత్రధారి ఆపైన లీలాజగత్తుకు వీడ్కోలు పలుకుతూ... మృణ్మయ దేహాన్ని విడిచిపెట్టేసాడు.... కస్తూరీ తిలకం లలాట ఫలకే  వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయం  కంఠే చ ముక్తావళిం గోపస్ర్తీ పరివేష్టితో  విజయతే గోపాల చూడామణీ అంటూ వేనోళ్ళ ముదమార స్తుతించబడిన శ్రీకృష్ణ మూర్తి సుందర దేహం ధూళి ధూసరిత ప్రదేశంలో అలా పడిపోవడం సకల ప్రకృతినీ కలచివేసింది.  పాలుతాగే ప్రాయంలోనే కరకు రక్కసుల పీచమణచిన దివ్య బాలకుడు...  నరకాసురునితో సహా అనేకమంది లోక కంటకులను నిర్జించిన మహా బలశాలి... ధర్మ వర్తనులైన పాండవులకు అండగా ఉండి కురుక్షేత్రాన్ని ధర్మ క్షేత్రంగా మార్చిన జగన్నాటక సూత్రధారి...  భావి యుగాల్లో తలెత్తే ధర్మగ్లానికి తరుణోపాయంగా భగవద్గీతను ప్రబోధించిన జగద్గురువు... ఊహించడానికి కూడా అన్యులు భయపడే మహాద్భుత ఘనకృత్యాలను అలవోకగా ఆచరించి చూపిన ఘనాఘనుడు...  ఇలా ఏకాకిగా మిగిలి.. కేవలం ఒక బాణం దెబ్బకు మృత్యుకౌగిలి చేరడమా? కారడవిలో, పొదల చాటున ఇంతటి దయనీయ స్థితిలో అంతిమ శ్వాస విడవడమా? ఏమిటీ విపరీతం... ఎందుకీ వైపరీత్యం?  బంగారానికి చెద పట్టిందంటే నమ్మశక్యమా? ఒక సాధారణ బోయవాడు విడిచిన నాటు బాణానికే జగదేకవీరుడైన శ్రీకృష్ణుడు ప్రాణాలు వదిలేస్తాడని ఎవరు మాత్రం ఊహించగలరు.. అసలెవరైనా ఎలా నమ్మగలరు...  సాక్షాత్తు పరమేశ్వరుని పాశుపతమైనా. బ్రహ్మదేవుని బ్రహ్మాస్తమైనా కూడా శ్రీ కృష్ణుని యెడల తమ శక్తిని చూపలేవు...దేవాదిదేవుడైన ఆ చిన్మయకారుని ముందు అవి ప్రణమిల్లి తమ పవిత్రతను, ప్రశస్తిని పెంచుకుంటాయి తప్ప ఎన్నటికీ ధిక్కరించవు.  అందుకేనేమో.... ఎట్టి దివ్యాస్త్రములూ కాక, ఇలా ఒక సాధారణ శస్త్ర ప్రహారమునకే తలవాల్చేలా ఆ స్వామి ఈ దివ్య ప్రణాళికను రచించినది !! ఏది ఏమయితేనేం... సర్వ సులభునిగా.. సర్వదా జన రంజకునిగా మెలిగిన ఆప్తమిత్రుడు.. భూమిపై అడుగిడినది మొదలు ప్రతి క్షణం, అడుగడుగునా ఎన్నెన్నో అద్భుతాలను ఆవిష్కరించి... త్రిలోక వంద్యునిగా నిలిచిన మహా పురుషుడు... సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంశతో ఆవిర్భవించిన అవతార పురుషుడు, లోకైక పాలకుడు... జగద్వంద్యుడు... తన దేహయాత్రకు స్వస్తి పలికాడు నేడిలా...  లోకాలకు దూరంగా... పెనుచీకటి గహ్వరానికి ఆవల... శతకోటి సూర్యుల ప్రకాశం సైతం చిన్నబోయే వెలుగు జిలుగుల కడలి చెంత... సుప్రకాశ సుందర శ్వేత ధామంలోని తన నిజవాసానికి ఆ జగత్పాలకుడు తరలిపోతున్నాడు..!  లీలామానుష దేహాన్ని దాల్చినది మొదలు ఆ మహనీయుడు కనబరచిన ప్రతి లీలా భక్తజనులను తన్మయులను చేసింది... ఆ ప్రతి లీలనూ తలచి తలచి మురిసిపోతూ జనులందరూ ముగ్ధులవుతున్నారు... కానీ నేడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శించిన ఈ లీల మాత్రం యావద్భక్తజగత్తును విషాద సంద్రంలో ముంచేసే దారుణ హేల.  శ్రీకృష్ణుని పార్థివ దేహం నుంచి దివ్యకాంతి పుంజం ఆవిర్భవించి ఊర్ధ్వ ముఖమై పయనించింది. ఆ కాంతి పుంజంలో ఉన్నది సూక్ష్మ శరీరధారి అయిన శ్రీ కృష్ణుడే. ఒక్కసారి తల దించి కిందికి చూసాడు ఆ దివ్యదేహధారి.  అచ్చు శేష పాన్పుపై శయనించే తనలాగే... అదే భంగిమలో భూమిపై కనిపిస్తున్నది చతుర్భుజధారి అయిన కృష్ణుని శరీరం... చిరునవ్వు విరిసింది దివ్యపురుషుని పెదవులపై.. ఆ నవ్వు ఆకాశమంతా వెలుగులు పూయించింది... ప్రకృతి అంతటా పరిమళాలను పంచింది. భూ ఆవరణాన్ని దాటి ఊర్ధ్వ ముఖుడై వస్తున్న శ్రీహరికి దేవగణమంతా... ఋషి సమూహమంతా స్తుతిసన్నుత వచనాలతో, వేద మంత్రాలతో స్వాగతం పలికింది. స్థిరమైన భక్తి శ్రద్ధలతో వారంతా ఆ మహనీయునికి ప్రాణములను అర్పించారు.  దేవదుందుభులు మ్రోగాయి... పుష్ప వర్షం కురిసింది... అప్సరసలు గీత నర్తనాదులతో పరమాత్మ విభూతులను కీర్తించారు. 

(సశేషం)

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం