శ్రీకృష్ణ వేదం - 03

శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

చిరునవ్వు విరిసింది దివ్యపురుషుని పెదవులపై.. ఆ నవ్వు ఆకాశమంతా వెలుగులు పూయించింది... ప్రకృతి అంతటా పరిమళాలను పంచింది. భూ ఆవరణాన్ని దాటి ఊర్థ్వ ముఖుడై వస్తున్న శ్రీహరికి దేవగణమంతా... ఋషి సమూహమంతా స్తుతిసన్నుత వచనాలతో, వేద మంత్రాలతో స్వాగతం పలికింది. స్థిరమైన భక్తి శ్రద్ధలతో వారంతా ఆ మహనీయునికి ప్రణామాలను అర్పించారు.  దేవదుందుభులు మ్రోగాయి... పుష్ప వర్షం కురిసింది... అప్సరసలు గీత నర్తనాదుతో పరమాత్మ విభూతులను కీర్తించారు.  శ్రీకృష్ణుని పార్థివదేహం నుంచి వెలువడి నింగికెగసిన ఆ దివ్య కాంతిపుంజం లోకాలోకాలనన్నిటినీ దాటి ఆవలనున్న పెనుచీకటిని కూడా ఛేదించుకొని ముందుకు సాగింది. అక్కడ కనిపించిందొక అద్భుత సన్నివేశం.... శతకోటి సూర్యతేజసమాభాసమైన దివ్యలోకం అక్కడ గోచరించింది. అదే వైకుంఠం. ఏ కదలికా లేని నిర్మమైన పాలకడలి... వెండి వెలుగులు చిందిస్తున్న ఆ పాలకడలిపై నురుగలా కనిపిస్తున్న శేషపానుపు... దానిపై నల్లని మూర్తి... తెల్లటి మెరుపు వెలుగులో వర్షమేఘంలా మెరిసిపోతున్న ఆ శ్రీ మహావిష్ణువును చేరి ఐక్యమైపోయిన కాంతిపుంజాన్ని గాంచి దేవగంధర్వయక్షకిన్నెర కింపురుషాదులు, ఋషులు పులకిత గాత్రులయ్యారు.  ఆహా ఎంత కాలం ఈ మహనీయుని ఎడబాసి ఉన్నామో గదా.. అనే వేదనా భావన వారిలో కలిగింది ఒక్కక్షణం.... ఇది నిజంగా విస్మయకరమే! అవును.. కృష్ణునిగా వ్యక్తమైన ఆ శక్తియే ఇక్కడ మహావిష్ణువుగానూ పరిపూర్ణత్వంతో ఇంతకాలం ప్రజ్వలిస్తూ ఉంది. నిజానికి ఈ పూర్ణశక్తి నుంచే ఆ కృష్ణావతారం వ్యక్తమైంది. ఒక పూర్ణతత్వం నుంచి ఆవిర్భవించిన మరో పూర్ణతత్వంగా ఆ విష్ణు తేజం కృష్ణరూపంలో భువికి పయనిస్తే... అదే సంపూర్ణ తత్వం ఇక్కడ విష్ణురూపంగా  శేషించి ఉండనే ఉన్నది !  ఇక్కడ వైకుంఠంలో ఈ మహావిష్ణువు... అక్కడ నందవ్రజంలో ఆ శ్రీకృష్ణుడు... ఇద్దరూ ఒకే శక్తితో, ఒకే తేజంతో... ఒకే మెరుపులా... మసిలారు ఇంతకాలమూ..  కానీ ఎందుకో ఈ విష్ణువు కంటే... ఆ కృష్ణుడే దగ్గరైపోయిన అనుభూతి... అందుకే... ఈ విష్ణువు ఇక్కడే ఉన్నా కూడా తమకు ఆ కృష్ణుని రూపంలో ఆయన దూరమైపోయాడన్న వెలితి!!  ఎందుకిలా జరిగింది!? అన్నీ తెలిసిన తామే ఎందుకింత అయోమయంలో పడిపోయినట్లు! ఆ కృష్ణ నిర్యాణంతో స్వామి తేజస్సు ఇక్కడికి వస్తే తప్ప ఇక్కడ వైకుంఠంలో మహావిష్ణువు లేడని ఎందుకు భ్రమించాం, ఎందుకింత పొరపాటు పడ్డాం! మహావిష్ణువు సర్వవ్యాపితత్వాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులుగా ఎందుకు మారిపోయాము?  మహావిష్ణువు విభూతులను గురించి, ఆయన అవతార తత్వాలను గురించి తెలియని మూర్ఖులమూ కాదే! అంతెందుకు పూర్ణమద: పూర్ణమిదం.. పూర్ణాత్పూర్ణ ముదచ్యతే... అని ఈశావాస్యోపనిషత్‌ ఏనాడో చెప్పింది కదా! పూర్ణతత్వం నుంచి ఒక పూర్ణతత్వం బయటకు వెళ్ళినా ఇక్కడ మిగిలేది కూడా ఆ పూర్ణతత్వమేనని భగవానుడి వైభవాన్ని ఆ శ్లోకం వర్ణించలేదా... తాము ఎన్నోసార్లు దానిని అవధరించి తరించలేదా!! మరి ఎందుకిలా ఈనాడు తామంతా సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నాం? ఇక్కడున్న విష్ణువు పరిపూర్ణుడు కాదని... అక్కడున్న కృష్ణుడే పరిపూర్ణుడని పొరబడ్డామా? లేక ఇది కూడా విష్ణుమాయేనా!? ఇలా తమలో తాము తర్కించుకుంటున్న ఋషులు, దేవప్రముఖులు కూడా అసలేమీ జరిగిందో అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. విష్ణుమాయ కాదు ... ఇది కృష్ణమాయ! అనే మాట వినిపించి వారంతా ఆశ్చర్యంతో అటు చూశారు. అక్కడ కనిపించాడు చిద్విలాస వదనంతో నారద మహర్షి! దేవతలారా, మహర్షులారా! అవును... ఇదంతా ఆ కృష్ణమాయే! విష్ణువు నిజమా, కృష్ణుడు నిజమా అన్నంతగా మీరంతా తికమక పడుతున్నారంటే ఆ న్లనయ్య చేసిన మాయ కాక  మరేమిటి? ఇంత చమత్కారం చేయగలిగినవాడు నిక్కంగా ఆ కృష్ణుడు తప్ప మరొకడు లేనే లేడు సుమా చమత్కారంగా పలికాడు నారదుడు. నారద మహర్షీ .. మీరు చెప్పిన మాటను మేము తీసి పారేయలేము. అలాగే మీరన్న మాటను విశ్వసించనూ లేకపోతున్నాం. కాస్త వివరంగా చెప్పి మా సందేహాలను దూరం చేసి పుణ్యం కట్టుకోండి.. పలికాడు దేవేంద్రుడు అంతే సరసంగా!  ఏమయ్యా దేవేంద్రా! ఏమీ తెలియని అమాయకుడల్లే నన్ను అడుగుతున్నావు కానీ.. నీకు తెలియదా ఆ కృష్ణమాయ! ప్రశ్నించాడు నారదుడు.  నూటపాతిక సంవత్సరా నాడు ఈ విష్ణువు ఆ చిన్నారి కృష్ణుని రూపంలో భూమిపై అవతరించాడు. అది మాత్రమే మీకు, నాకు తెలుసు! ఆ తర్వాత ఎన్నడైనా మనం మళ్ళీ ఈ వైకుంఠ ద్వారం వైపు చూశామా? ఎప్పుడూ మన మన చూపులు, మనసు, అడుగులు అన్నీ ఆ రేపల్లె వైపు, మధుర వైపు, ద్వారకానగరం దిశగానే ఉండేవి కాదూ!

 (సశేషం)

ముఖ్యాంశాలు