శ్రీకృష్ణ వేదం -04

(శ్రీమద్భాగవత, మహా భారతాంతర్గత శ్రీ కృష్ణ చరితామృతం)

శైలి : దీక్షితుల సుబ్రహ్మణ్యం

ఆహా.. ఆనాడు నేను స్పర్థ పూని నా శక్తిని ప్రదర్శించబోయినది సాక్షాత్తు జగత్పాలకునితోనే కదా! చిన్ని కృష్ణునిగా ఆ స్వామి గోకులాన వర్ధ్లిల్లుతుండగా... నేనీ ఇంద్రపదవిని చూసుకొని మిడిసిపడినాను ఆనాడు. అందాలు చిందే ఆ దివ్యబాలకుడు అంతే అందంగా నాకు గుణపాఠం నేర్పినాడు కదా ఆరోజున! ఆహా.. నా ఓటమి కూడా ఆనాడు ఎంత ఆనందాన్ని కలిగించిందో కదా!  ముచ్చటగొలిపే ఆ చిన్నారి కృష్ణుడు చిటికెనవేలిపై అంతపెద్ద మహాపర్వతాన్ని మోయటమా...! భయానకమైన మెరుపులు, దారుణమైన ఉరుములు, పిడుగులతో కూడిన కుంభవృష్టి నుంచి, మహా ప్రకృతి విపత్తు నుంచి కూడా చిద్విలాసవదనుడై యావత్‌ యాదవులనూ రక్షించిన ఆ అద్భుత సన్నివేశం మహామహిమాన్వితం కాదూ...! ఇలా అనుకుంటూ ఇంద్రుడు మురిసిపోతున్నాడు. ‘చూశావా ఇంద్రా... ఆనాటి ఆ మధురానుభూతుల పరవశంలో మునిగి మా ఉనికినే మరచిపోయావు!’ నారదుడి చమత్కారంతో తన పరధ్యానంలోనుంచి బయటపడ్డాడు దేవేంద్రుడు. నారదుడు ఏ ముహూర్తాన కృష్ణమాయకు తెరతీశాడో గానీ.. అక్కడున్న ఋషులు, దేవప్రముఖులు అందరి ఆలోచనలూ దానిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఎవరికి వారే విష్ణుమాయను కూడా ఛేదించుకొని కృష్ణమాయాబద్ధులైపోయారు. వారందరి ఆలోచనల్లోనూ ఆ కృష్ణుడే!  అవును నిజమే కదా! మోహాలకు అతీతులమయ్యామనే కదా తమకీ ఉత్తమ గతులు. దేవతలంటే ఆనందస్వరూపులని, వారి స్వర్గమే ఆనందనిలయమని లోకాలాన్నీ కొనియాడతాయి. ఇక్కడికి రావాలని లోకాల్లోని వారంతా తహతహలాడతారు. కానీ ఈ కృష్ణుడు ఆ లోకగతినే మార్చేశాడు! తానున్న తావునే స్వర్గాధికం చేశాడు. తాను ఎక్కడ కాలు మోపితే అక్కడ దివ్యానందాన్ని ప్రతిష్ఠించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వైకుంఠాన్నే భూమికి దించేశాడు ఈ నల్లవాడు. బహు గడసరి అయిన ఈ కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తినే మరిపించి సర్వులనూ మురిపించాడు. భూజనులనే కాదు సురాసురులను, సర్వసంగ పరిత్యాగులు, మహాజ్ఞానులు అయిన ఋషులను కూడా మహా సమ్మోహనంలో ముంచేశాడు. పండితపామరజనభేదం లేకుండా అందరికీ ఆప్తుడయ్యాడు. భూమిపై పరిపూర్ణ భగవదవతారుడై కాలిడినది మొదలు తిరిగి నేడు వైకుంఠానికి వచ్చే వరకూ ప్రతిక్షణం ఎంతగా అలరించాడు.. ఎంతెంత లాలించాడు.. ఎంత గొప్పగా పాలించాడు! దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే తన అవతార లక్ష్య సాధనలో ఆ మహనీయుడు ఎంచుకున్న మార్గం అనితరం కాదూ! ఆహా... ఎన్నెన్ని రీతులలో శిష్టులను సంతోషభరితులను చేశాడు. ఎంత గొప్పగా వారిని ఉద్ధరించాడు. సజ్జన మధ్యంలోనే తాను ఉంటానని చెప్పిన ఆ మహాపురుషుడు తన చుట్టూ ఉన్న సర్వాన్ని ఎంతగా మార్చేశాడు. అది నందవ్రజమైనా, బృందావనమైనా... మధుర అయినా... ద్వారక అయినా... హస్తిన అయినా, కడకు కురుక్షేత్రమైనా సరే .... ఎక్కడ తానున్నా సర్వం ఆనందసాగరమే! అందరికీ తానున్నానని అనుక్షణం ఆయన కల్పించిన విశ్వాసం... ఆయన ఇచ్చిన ధైర్యం అనన్యసాధ్యం. అహరహమూ ఆ మాటను నిలబెట్టుకుంటూనే ఇంతకాలమూ భూమిపై చరించాడు ఆ దివ్యపురుషుడు.  చివరికిలా ఈనాడు లోకాలన్నిటినీ వదిలి... తన నిజ వాసానికి విచ్చేశాడు లోక విభుడు. ఇది సంతోషించాల్సిన విషయమే తామందరికీ...! కానీ ఆ సంతోషం స్థానంలో ఏదో వెలితి.. ఏదో బాధ తొలిచేస్తున్నాయి ... ఏమిటీ విపరీతం!  శ్రీమహావిష్ణువు పరిపూర్ణుడైనా కూడా ఆ కృష్ణుని యందే తమ మానసాలు ఏల లగ్నమై ఉన్నాయి... అక్కడ కృష్ణుడు శరీర విసర్జన చేస్తే తాము ఎందుకు కళవెళ పడుతున్నట్లు?

(సశేషం)

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us