వ్యవసాయానికి చేయాల్సిన సాయం ?


ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు దానిని వెంటనే అమ్ముకొని మరోసారి సాగుకి సిద్ధం కావాలని కోరుకుంటాడు గానీ.. పంటని కోల్డ్ స్టోరేజిలో దాచుకుని గిరాకీ ఉన్నప్పుడు ఎప్పుడో అమ్ముకోవాలని అనుకోడు. ఇలా చేసేది వ్యాపారాలు మాత్రమే. ఒకవేళ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలు కట్టించి ఇచ్చిందే అనుకుందాం. ప్రతి రైతుకీ సాధ్యం కాదు కదా. దీనికోసం రైతు కమిటీలో లేక ఇంకోటో ఏర్పాటవుతాయి. అక్కడా పెద్ద రైతులదే పైచేయి, పెత్తనం అవుతాయి. పంట కోసిన తర్వాత కళ్లంలోనే ఎంతొస్తే అంతకి అమ్మేసుకోవడం ఇవాళ చాలామంది చిన్న రైతులు చేస్తున్న పని. ఎందుకంటే పంటని ట్రాన్సుపోర్టు చేయడం .. నిబంధనలన్నీ సంతృప్తిపరచి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడం రైతులకి చేతగాని పనులు. దళారుల వ్యవస్థ అక్కడ రాజ్యమేలుతోంది. పంట బోర్లు కానీ, గోదాంలు కానీ చిన్న రైతులకి అందుబాటులోనూ ఉండవు.. అవి అవసరమూ లేదు. పదెకరాల పైన ఉన్న రైతుకి తప్ప బోరు వేయించుకునే స్థోమత, అవసరం ఉండవు. అలంటి రైతులు బోర్లు వేసి వాటినుంచి తమకు కావలసిన నీళ్లు తోడుకొని మిగతా నీళ్లు చుట్టూ ఉన్న చిన్న రైతులకి అమ్ముకుంటున్నారు.

నిజానికి పంటకి అయ్యే సాగు వ్యయాన్ని శాస్త్రీయంగా గణించి దానిమీద ఎంతో కొంత వేసి కనీస గిట్టుబాటు లేదా గ్యారంటీ ధర ఇస్తే చాలు.. అదే రైతుకు పరమానందం. ఎందుకంటే రైతులు ఎవరూ వ్యాపారం చేయాలని అనుకోరు... వాళ్ళు వ్యవసాయమే చేయాలి అనుకుంటారు. తమ కష్టం మట్టిలో కలిసిపోకుండా ఉంటే చాలు అనుకుంటారు! అంచనా వ్యాపారుల కనుసన్నల్లో ధాన్యం అమ్మకాలు జరుగుతున్న పరిస్థితుల్లో... ప్రయివేటు అప్పులపైనే సాగు కొనసాగుతున్న ఈ రోజుల్లో.. రైతుకి తక్షణం అయినకాడికి అమ్ముకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుచేత రైతుకి నిజంగా ఏదైనా ఉపకారం చేయాలనే ఆలోచన ఏలికలకు ఉంటే... కనీస మద్దతు ధర (అంటే ఇప్పుడు నిర్ణయించిన ధర కాదు) ని గ్యారంటీ ధరని ప్రకటించాలి. దానికి చట్టబద్ధత కల్పించాలి. పండించిన ప్రతి బస్తాకి పెట్టుబడి పోను పది రూపాయలు మిగిలినా వ్యవసాయం బతుకుతుంది.

1977.. జనతా ప్రభుత్వం ఉన్న రోజులు.. అప్పట్లో బస్తా ధాన్యం కొనుగోలు ధర అరవై రూపాయలు! ఆ రోజుల్లో రోజు కూలి ఐదు రూపాయలు! ఇప్పుడు రోజుకూలి 400 పైమాట .. ధాన్యం ధర ఎంతుందో మనకి తెలుసు!!

ఇటువంటి వాస్తవ ప్రమాణాల ఆధారంగా రైతుకి గిట్టుబాటు ధరని నిర్ణయించాలి!పంటపండితే గిట్టుబాటు ధర ఇవ్వాలి... ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోతే గ్యారంటీ ధర ఇవ్వాలి. ఇదీ అత్యవసరంగా, అనివార్యంగా చేయాల్సిన పని.

కోల్డ్ స్టోరేజీలు, నిత్యావసర సరుకుల చట్టాన్ని మార్చడం, ఇవన్నీ వ్యవసాయ ఆధారిత కార్పొరేట్ వ్యాపార రంగానికి మేలు చేస్తాయి తప్ప రైతుకి ప్రత్యక్షంగా మేలు చేయవు. రైతుపై ఆధారపడిన వ్యాపారాలు బాగుంటే రైతు కూడా బావుంటాడు అనే లాజిక్ కి లోబడి మనం ఆలోచిస్తే.. ఇప్పుడు కూడా రైతే బాగోలేడు.. రైతుపై ఆధారపడిన పరిశ్రమలు, వ్యాపారాలు చక్కగానే ఉన్నాయి.


ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం